రేపిస్టులకు కఠిన శిక్షలు విధిస్తున్న దేశాలివే!

న్యూఢిల్లీ : 'దిశ'పై ఘోరంగా అత్యాచారం జరిపి క్రూరంగా హత్య చేయడంతో నేరస్థులను బహిరంగంగా ఉరితీయాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలే  కాకుండా సామాన్యుడి నుంచి సామాజిక కార్యకర్త వరకు నేడు డిమాండ్‌ చేస్తున్నారు. రేప్‌ కేసులకు సంబంధించి ప్రపంచంలోని ఇతర దేశాల్లో కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి ? వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం ఉంది ? అన్న అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన 195 దేశాల్లో పది దేశాల్లో రేప్‌ కేసులకు కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. షరియా చట్టాలు అమలు చేస్తున్న ఇస్లామిక్‌ దేశాల్లో కఠిన శిక్షలు ఎక్కువగా ఉన్నాయి.



ఒకప్పుడు రేప్‌ కేసుల్లో నేరస్థులను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేవారు. దీన్ని 'ఎక్జిక్యూషన్‌ త్రో స్టోన్స్‌' అని వ్యవహరించేవారు. చచ్చేవరకు నేరస్థుడు బాధ అనుభవించాలనే ఇస్లాం మతం ప్రకారం ఈ శిక్షను అమలు చేసేవారు. ఆ తర్వాత బహిరంగంగా తల నరికి చంపెవారు. ఇప్పుడు అక్కడ కూడా ఇలాంటి క్రూర శిక్షలను విధించడం లేదు. బహిరంగంగా 80 నుంచి వెయ్యి వరకు కొరడా దెబ్బలు, ఆ తర్వాత పదేళ్ల వరకు జైలు శిక్షలను అమలు చేస్తున్నారు. వివాహేతర సంబంధాల విషయంలో మగవాళ్లతోపాటు ఆడవాళ్లకు బహిరంగ కొరడా శిక్షలను అమలు చేస్తారు. వాటిని కనిపెట్టడానికి మతపరంగా 'రహస్య పోలీసులు' ఉంటారు.