హ్యాట్రిక్‌ విజయంతో సెమీస్‌లోకి..

మెల్‌బోర్న్‌:  మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో  భారత జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. గ్రూప్‌-ఎలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టీమిండియా సెమీస్‌ బెర్తును అందరికంటే ముందుగా ఖాయం చేసుకుంది. కివీస్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.దాంతో 134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్‌ వరకూ కివీస్‌ పోరాడినా విజయాన్ని సాధించలేకపోయింది. చివరి ఓవర్‌లో కివీస్‌ విజయానికి 16 పరుగులు కావాల్సిన తరుణంలో ఆ జట్టు 11 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది.. కివీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో అమేలియా కెర్‌(34 నాటౌట్‌; 19 బంతుల్లో 6 ఫోర్లు) చివరి వరకూ పోరాటం కొనసాగించగా, మ్యాడీ గ్రీన్‌(24), క్యాటీ మార్టిన్‌(25)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలింగ్‌లో శిఖా పాండే, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు.( ఇక్కడ చదవండి: నైట్‌ సెంచరీ: ఇంగ్లండ్‌ భారీ విజయం)