తిరుమలలో ధన్వంతరి మహాయాగం

 తిరుమల : ప్రపంచంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ నెల 26 నుంచి 28 వరకు ధన్వంతరి మహాయాగం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం జరపనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రపంచం భయభ్రాంతులకు గురవుతోందన్నారు. శ్రీమహావిష్ణువు రూపాలలో సర్వ రోగాలను నయం చేసే ధన్వంతరి రూపం ఒకటని, ఈ యాగం నిర్వహించడం వల్ల మానవాళికి నష్టం కలిగించే వ్యాధులు నయమవుతాయని పేర్కొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి, మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహిస్తామని చెప్పారు. కాగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో తిరుమలలో భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.