థానే : ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల కొంతమంది ప్రాణాలు అనవసరంగా పోతున్నాయి. సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా నడుచుకుంటూ వెళుతూ కాస్త దగ్గినా వారిని అనుమానుంగానే చూస్తున్నారు. ఎంతలా అంటే ఒక్కోసారి తమ విచక్షణ కోల్పోయి అవతలి వ్యక్తి ప్రాణాలను కూడా తీసేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. థానేలోని కళ్యాణ్ పట్టణంకు చెందిన గణేష్ గుప్తా ఇంట్లో సరుకులు అవసరం పడడంతో బుధవారం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. థానే ఏరియాలో లాక్‌డౌన్ కట్టదిట్టంగా ఉండడంతో పోలీసులు పట్టుకుంటే ప్రశ్నల వర్షం కురిపిస్తారని భావించిన గణేష్ వారి కంట పడకుండా వేరే సందులోంచి వెళ్లాడు. అయితే కొద్దిదూరం నడిచిన తర్వాత గణేశ్ విపరీతంగా దగ్గడంతో పక్క నుంచి వెళుతున్న కొంతమంది వ్యక్తులు కరోనా ఉందోమోనని భావించారు. దీంతో ఒక్కసారిగా గణేశ్‌పై దాడి చేసి విపరీతంగా కొట్టారు. అయితే ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పెద్ద కాలువలో జారిపడి గణేష్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కరోనా : వారి అనుమానం అతని ప్రాణం తీసింది