చెల్లెలి కోసం అన్న ..

టీ.నగర్‌: చెల్లెలి కోసం అన్న సైకిల్‌పై 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. మదురై కూడల్‌ నగర్‌కు చెందిన ముత్తు, తమిళ్‌సెల్వి దంపతులకు కొడుకు జీవరాజ్, కూతురు ప్రవీణ ఉన్నారు. మదురైలోని ప్రైవేటు కళాశాలలో జీవరాజ్‌ చదువుతుండగా ప్రవీణ తేనిలో కంటి ఆస్పత్రి ఆధీనంలోని నర్సింగ్‌ కళాశాలలో డిప్లొమా చదువుతోంది. తేని జిల్లాలో 43 కరోనా కేసులు నమోదు కావడంతో జీవరాజ్‌ తన చెల్లెలును మదురైకు తీసుకువచ్చేందుకు తన పాత సైకిల్‌పై మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు.












సుమారు 80 కి.మీ దూరంలో ఉన్న తేనికి చేరుకోగా అన్నను చూసి ప్రవీణ ఆనందంతో ఏడ్చేసింది. ఆ తరువాత ఇద్దరూ బుధవారం ఒకే సైకిల్‌పై ఇంటికి బయలుదేరారు. జీవరాజ్‌ సైకిల్‌పై వచ్చిన సమాచారం స్థానిక పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రామలక్ష్మికి తెలియడంతో స్థానికులు కొందరు అన్నాచెల్లెలిని మదురైకు కారులో పంపారు.